Friday, February 29, 2008

తెలుగులో సంభాషించండి.....

సభకి నమస్కారం,
రోజు రోజుకీ, తెలుగులోనే మాట్లాడాలి అన్న కాంక్ష ఎక్కువైపోతోంది..ఎందుకా అని ఆలోచిస్తే తెలిసింది,..మన చుట్టూ ఉన్న వాళ్ళళ్ళో తెలుగు మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ. పోనీ వాళ్ళకి తెలుగు రాదా అంటే, తెలుగు బిడ్డలే..ఇలా ఎందుకా అని ఆలోచించినా, సమాధానం దొరకలేదు. కాకపోతే, ఇలా పోతే మన బాష ఎమైపోతుందా అని బాధ అంతే.


తెలుగుకి ఉన్న అందం, మాటల్లొ చెప్పలేనిది. అది కేవలం అనుభవించాలి...మన తెలుగు జాతిని ఉద్దరించిన మహానుభావులలో, పద కవితా పితామహ శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు అగ్రగణ్యులు. వీరే కాదు, కీర్తనా పరంగా తీసుకుంటే , శ్రీ త్యాగరాజుల వారు, రామదాసు గారు, క్షేత్రయ్య గారు . సాహితీ పరంపర అయితే ఇంక చెప్పేదేముంది, ఆంధ్ర కవితా పితమహ అల్లసాని పెద్దన్న గారు,ఆదికవి నన్నయ్య భట్టారకుడు, తిక్కన్న సోమయాజి, యెఱ్ఱాప్రగ్గడ, మధురకవి నంది తిమ్మన్న, విశ్వనాథ సత్యన్నారయణ, ఇలా ఒకరేమిటి, తెలుగు సాహితీ సంపదకి ఎనలేని ఐశ్వర్యాన్ని తెచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు..


ఇవన్నీ ఎందుకిప్పుడూ అంటే, సమాధానం చాలా సులభంగా ఇవ్వచ్చు. మనం మన బాషకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వటం లేదు. ఇళ్ళ దగ్గర అమ్మలు, పక్క వాళ్ళతో అనే మాటలు ఇలా ఉంటాయి, "మా అబ్బాయి తెలుగు లో చాలా weak అండీ" ..ఈ మాట ఆవిడ చాలా మురిసిపోతూ చెప్తుంది,ఎందుకంటే , తెలుగు సరిగ్గా రాదు అంటే, అదో గొప్ప. వాడికి కేవలం ఆంగ్లం వచ్చన్నమాట. అవును వాడికి తెలుగు యెలా వస్తుంది? ఇంట్లో వాళ్ళెప్పుడూ, ఆంగ్లం లోనే మట్లాడితే. దీనిమూలంగా మాకేమి నష్టం అని అడగ వచ్చు. లేదు, అతనికి/ఆమెకివచ్చిన నష్టం లేదు, కాని, తెలుగు బిడ్డలు అయి ఉండీ, తెలుగు ని గౌరవించలేనప్పుడు, మన బాషకి వాళ్ళు తీరని నష్టాన్ని తెస్తున్నట్టే.


యెలా అంటారా, కనీసం తెలుగు మాట్లాడలేని వాళ్ళు, రేపు,తమ పిల్లలకి తెలుగుని ఎమి నేర్పుతారు? ఎందుకు, మనలొనే తీసుకుందాం,

యెవ్వాని వాకిట నిహమద పంకంబు రాజ పూజిత రొజొ రాజినడగు
యెవ్వాని చారిత్ర మెల్ల లొకములకు నొజ్జ యై వినయంబు నొరపుగొరపు
యెవ్వాని కడకంట నివ్వటిల్లెడు చూడ్ద్కి మానిత సంపదలీనుచుండు
యెవ్వాని గుణలతలేడు వారాసుల, కడపటి కొండ పై కలయ బ్రాకు
అతడు భూరిప్రతాప మహా ప్రదీప దూరవికటిత గర్వాంధకార వైరి వీర కోటీర
మని ఘని వేష్తితాంగినలుడు, కేవలమత్యుడె ధర్మసుతుడు..


అసలు ఇవాల్టి వాళ్ళు ఈ పద్యానికి అర్థం చెప్పగలరా? తిక్కన భారతం లోని విరాట పర్వం లోని పద్యం. నాకు తెలిసిన ఒక్క పద్యమెదో రాశేసి ఎదో అనేస్తున్నా అనుకోవద్దు.నేను ఉదాహరణ మాత్రమే ఇస్తున్నాను. మన బాషని మనమే అర్థం చేసుకోలేని పరిస్థితులలొ ఉంటే, ఇంక మిగతా వాళ్ళకి మన బాష మీద గౌరవం ఎక్కడినించి వస్తుంది? తెలుగు జాతి కన్నట్టి ముద్దు బిడ్డలమై ఉండి, మన ఖర్మ కాలి, తెలుగు లో సంభాషించుకోలేక పోతున్నాం.

అదేదొ,చిత్రం లో ఒక పాట ఉంటుంది, అన్ని బాషలని నీవు అభిమానించు(నాకు గుర్తులేదు), మాతృ బాష లోనే నీవు సంబాషించు అని..

అన్నమాచార్యులు పుట్టి, ఉద్దరించిన గడ్డ మీద, దయచేసి, రొజూ, ఇంట్లో అన్నా తెలుగులో మాట్లాడండి. తెలుగు తల్లి గౌరవాన్ని కాపాడండి.

ఎందరోమహానుభావులు అందరికీ వందనం
వంశీ కృష్ణ కార్తీక్ వల్లూరి