"అహొబిలే గారుడ శైల మధ్యే కృపావశాత్ కల్పిత సన్నిధానం
లక్ష్మ్యా సమాలింగిత వామ భాగే లక్ష్మీ నృసిం హం శరణం ప్రపద్యే "
చాలా రోజులనించీ రాద్దామని ఇప్పటికి వ్రాయగలుగుతున్నా. ముందుగా ఆచార్యులకి నమస్కరించుకుంటూ
"శ్రీమద్రంగ శఠారిసమ్యవమిరాట్ లబ్దాంగమంతద్వయం
శ్రీమద్వీర రఘూద్యహద్య శఠజిత్ పాదార విందాశ్రయం
శ్రీమద్వేత వతంసదేసిక యతే: కారుణ్య వీక్షాస్పదం
సేవేరజ్గ దురీన శాశనవనం నారాయణం యోగినం
శ్రీమతే శ్రీ లక్ష్మీ నృసిమ్హ దివ్య పాదుకా సేవక శ్రీవన్ శ్రీ నారాయన యతీంద్ర మహాదేశికాయనమ:"
అహోబిలం నవనారసిం హ క్షేత్రం. ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని కుర్నూల్ జిల్లా ఆల్లగడ్డ మండలం లో ఉంది. మన తెలుగు నేల మీద ఉన్న రెండవ దివ్య దేశం (మొదటిది తిరుమల). అహొబిల క్షేత్రం తెలుగు నేల మీద ఉన్నప్పటికీ, అక్కడ అంతా తమిళ సాంప్రదాయమే ఉండటం విశేషం .
ఒక సారి చరిత్ర లోకి వెళ్తే
సుమారుగా ఏడు వందల సంవత్సరాలకి పూర్వం, తిరునారాయణపురం లో ఉండే ఒక పంతొమ్మిదేండ్ల అబ్బాయికి కలలొ కనపడిన శ్రీలక్ష్మీనృసిమ్హు డు, అహొబిలం రమ్మని సెలవు ఇచ్చారట. ఆ అబ్బాయి వాళ్ళ ఆచార్యుల వద్దకు వెళ్ళి, ఆచార్య వర్యా, నన్ను ఇలా అహోబిలం రమ్మని శ్రీవారి ఆజ్ఞ అయ్యింది, సెలవ ఇవ్వండి అని ఆచార్యుల వద్ద సెలవు పుచ్చుకుని, దట్టంగా పెరిగి ఉన్న నల్లమల అడవుల మధ్య ఉన్న అహోబిల క్షేత్రానికి వచ్చారు. అక్కడ వేంచేసి ఉన్న నవ నారసిమ్హ దేవలయాలను దర్శించినారు..ఇంతకీ ఆ నవ నారసిం హులు ఎవరూ అంటే,ఒక శ్లోక రూపం లో మనం ఇలా అనుకోవచ్చు...
"జ్వాల అహోబిల మాలోల
క్రోఢ కారంజ భార్గవ
యొగానంద చత్రవట పావన
నారసిం హ నవ మూర్తయ... "
విశదీకరిస్తే,
1. జ్వాలా నరసిం హుడు
2 అహోబిల నరసిం హుడు
3 మాలోల నరసిం హుడు
4. క్రోఢ నరసిం హుడు
5. కారంజ నరసిం హుడు
6. భార్గవ నరసిం హుడు
7. యోగానంద నరసిం హుడు
8. చత్రవట నరసిం హుడు
9. పావన నరసిం హుడు
ఈ నవ నారసిం హ క్షేత్రాలు దర్శనం చేసుకుని, బసకి చేరి, నిద్రుస్తున్న ఆ బాబు కలలో, నరసిం హ స్వామి మరలా దర్శనమిచ్చి, నాయనా, నీవు శ్రీవైష్ణవ తత్వాన్ని వ్యాప్తి చేసే కార్యక్రమాన్ని స్వీకరించాలి. అంతేకాక, నా ఉత్సవ మూర్తులలొ ఒక మూర్తిని నీతొ పాటు తిప్పాలి అని ఆజ్ఞాపించారు....ఇప్పుడు ఉన్న ప్రశ్న ఏంటి అంటే, అహొబిలం లొ తొమ్మిది క్షేత్రాలు ఉండటం వల్ల, తొమ్మిది ఉత్సవ మూర్తులు ఉంటాయి....యే మూర్తిని తీసుకెళ్ళాలొ తెలియక ఈయన, ధ్యానం లొ కుర్చుంటారు. అప్పుడు, మాలోలన్ ఉత్సవ మూర్తి వచ్చి ఈయన వొల్లొ పడిందట. కాకతాళీయమో,భగవద్ కృపయో, మాలోలన్ ఉత్సవ మూర్తికి పాదుకలు ఉంటాయి. ఇది భగవత్ కృపయే..ఈయన సంచారం చేస్తారు కాబట్టి, పాదుకలు అన్నమాట. అప్పుడు ఆ సన్నివేసాన్ని చూసిన ఆ ఆలయ నిర్వహణాధికారులు, ఈయన వద్దకి వచ్చ్చి, నమస్కరించి, గుడి భాద్యతలు చేపట్టవలసిందిగా కొరారు. అప్పుడు యేర్పాటు అయినదే, శ్రీ అహోబిల మఠం, లేదా శ్రీ మఠం. ఆ పంతొమ్మిదేండ్ల అబ్బాయే శ్రీ ఆదివన్ శఠగోప యతీంద్రులు. అహోబిల మఠ పీఠానికి మొట్టమొదటి పీఠాధి పతి.ఈయన తనియన్ ఒకసారి అనుకుంటే
కేశవార్య కృపా పాత్రం ధీశమాధి గుణార్ణవం
శ్రీ శఠారి యతీశాంద్రం దేసికేంద్రం అహం భజే
ప్రపత్యె నివ్రాష్యద్యం నిషద్యం గుణ సంపదాం
శరణం భవ భీతానం శఠకోప మునీస్వరం
శ్రీమతే శ్రీ ఆదివన్ శఠకొప యతీంద్ర మహా దేశికాయ నమహ.
ఇప్పుడు ఉన్న పీథాధి పతి, అస్మదాచర్యులు, శ్రీ లక్ష్మి నృసిం హ దివ్యపాదుకా సేవక శ్రీవన్ శ్రీ శఠకోపశ్రీ నారయణ యతీంద్ర మహాదేశికుల వారు 45వ పీఠాధి పతి.
అహొబిలం లొ హిరణ్య కశప వధ జరిగినట్టుగా మనకి స్థల పురాణం చెప్తోంది. అక్కడ , స్వామి వారు ఉద్భవించిన, ఉగ్ర స్థంభం కూడా ఉన్నది. ఇక్కడ ఒక శ్లోకం చెప్పుకోవాలి, స్వామి వారు హిరణ్యకశపుని వధ చేస్తున్న సమయం లో, ఆయన గోళ్ళనే ఆయుధాలు గా వాడారు. ఆ పరాక్రమం చూసిన దేవతలు...
"అహోవీర్యం అహోసౌర్యం అహో బాహు పరాక్రమం
నారసిమ్హం పరం దైవం అహోబలం అహోబలం "
అని శ్రీనరసిమ్హుడిని పొగిడారట....
ఆళ్వారుల ప్రభంధాల పరంగ చూసుకుంటే, తిరుమంగయాల్వార్ గారు, అహోబిల నరసిమ్హుడి మీద పది పాసురాలు వ్రాశారు. సింగవెల్ కుండ్రం..అని ఆయన అంటారు.
సంకీర్తన పరంగా కూడా అహోబిలానికి చాలా ప్రాముఖ్యత ఉంది...శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు, అహోబిల మఠం శిష్యులు. వారు ఆదివన్ శఠగొపన్ గారి శిష్యులు. ఆదివన్ శఠగోపన్ గారి మీద అన్నమాచార్యుల వారు వ్రాసిన ఒక పాట...
చూడుదిందరికి సులభుడు హరి
తోడునీడ యగు దొరముని ఇతడు...
ఇందులొ, తన ఆచర్యులు విరజా నది మీద నావ లాంటి వారు అని సంబొధిస్తారు... ఆపాటలొ ఆఖరి చరణానికి వస్తే,
కరుణానిధి రంగపతికి కాంచీవరునకు వేంకటగిరి పతికి
నిరతి నహోబల నృకేసరికిని తత్పరుడగు శఠకొప ముని ఇతడు....
అని ముగిస్తారు. ఈ పాట చెప్పేస్తుంది మనకి, అన్నమాచార్యులవారి ఆచార్య భక్తి గురించి.
ఇక అలయాల విషయానికి వస్తే...
పైన చెప్పిన తొమ్మిదీ కాక, కింద అహొబిలం లొ, ప్రతిష్ట చేసిన లక్ష్మి నరసిం హుల వారి ఆలయం ఉంటుంది. ఇక్కడ లక్ష్మి నరసిమ్హుల వారు, అమ్మవారిని తొడ మీద కుర్చోబెట్టుకుని కూర్చుని ఉంటారు...ఆయన కుర్చున్న విధం ఎల ఉంటుంది అంటే, దానిని కూడా అన్నమాచార్యుల వారు ఒక కీర్తన లొ ఇల వర్ణించారు:
ఆరగించి కూర్చున్నాడల్లవాడే
చేరువనే చూడరె లక్ష్మి నారసిమ్హుడు.
ఇందిరను తొడ మీద ఇనుకొని కొలువిచ్చి
అందపు నవ్వులు చల్లి అల్లవాడే
చెందిన మాణికముల శేషుని పడగ మీద
చెంది వరాలిచ్చె లక్ష్మి నారసిమ్హుడూ
బంగారు మేడలోన పచ్చల గద్దియల మీద
అంగనల ఆట చూసి అల్ల వాడే
రంగగు సొమ్ముల తోడ రాజసపు విభవాన
చెంగట నున్నాడు లక్ష్మి నారసిమ్హుడు
పెండెపు పాదము సాచి పెనచి ఒక పాదము
అండనే పూజ కొని అల్ల వాడే
కొండల శ్రీవేంకటాద్రి కోరి అహోబలమున
మెండుగాను మెరసి లక్ష్మీ నారసిమ్హుడు...
లక్ష్మి నరసిమ్హుడి దర్శనం చేసుకుంటున్నప్పుడు, ఆఖరి చరణo దాని అంతట అదే నోట్లోంచి వచ్చేస్తుంది అంటే అతిసయోక్తి కాదు.అంత అందంగా వర్ణించారు అన్నమాచార్యుల వారు.
ఆహోబిల నరసిం హుడు
===================
ఈ గుడికి వెళ్ళటానికి రహదారి ఉంది. ఒక యెభై మెట్లు ఎక్కితే సరిపోతుంది. అక్కడ ఉగ్ర రోపం లో కొలువై ఉంటాడు శ్రీ అహోబిల నరసిం హుడు. ఆలయానికి ఇదివరకటి ప్రవేశాన్ని మూసి వేశారు(వేరే ద్వారం ద్వారా ప్రవేశం ఉంటుంది) ఎందుకంటే, మాంసాహర నివేదన తీసుకుని ఆటవికులు వస్తున్నారట, అవును మరి వారి అల్లుడు కదా ఈయన (నరసిం హుడు). ఇక్కడ, చెంచులక్ష్మి అమ్మ వారు ఉంటారు. సుదర్శనాల్వార్ కూడా ఉంటారు.
జ్వాలా నరసిం హుడు
====================
ఈయనది జ్వాలా రూపం. జ్వాలా నరసిం హుడి గుడికి(గుడి అనేకన్న, గుహ అనాలేమొ) వెళ్ళాలి అంటే, చిక్కటి అడవిలో సుమారు ఒక 3కి.మి ప్రయాణం చెయాలి. మధ్యలొ
మనకి చిన్న చిన్న గుట్టలు, మనకి ఒక వైపు గరుడాద్రి, ఒక వైపు వేదాద్రి కొండలు వుంటాయి. అక్కడికి రాంగానే,
"గరుడాద్రి వేదాద్రి కలిమి ఈపె..." అనే అన్నమాచార్య కీర్తన గుర్తుకొచ్చేస్తుంది...
అలా నడుస్తూ ఉంటే, ఒక నది వస్తుంది. ఆ నది పేరే, భవనాసిని. మళ్ళీ ఒక కీర్తనలొకి వెళ్తే,
"భవనాసినీ తీర భవ్య నర కేసరి" ..అని ఒక కీర్తనలో, "భవనాసినీ తీర పంచాననం" అని ఒక చోట అన్నమాచార్యుల వారు ఆ భవనాసిని నది
యొక్క విసిష్టతని చెప్తారు. ఆభవనాసిని లొ పవిత్ర స్నానమాచరించి, ముందుకు వెళ్ళగా,వెళ్ళగా ,వెళ్ళగా, భవనాసిని జలపాతం వస్తుంది. ఆజలపాతం ప్రక్కనే ఒక నీటి గుంట ఉంటుంది. అక్కడే స్వామి వారు గోళ్ళు కడుక్కున్నారట, ఆ నీరు ఎంత తీపో నేను చెప్పలేను. అది త్రాగి చూస్తే మీకె తెలుస్తుంది. ఆ జలపాతం దాటుకుని వెల్లగా,(చిన్న జలపాతమే) అక్కడ కొలువై ఉన్నాడు, శ్రీ జ్వాలా నరసిం హుడు. ఆష్తభుజాలతో, జ్వాలారూపుడై ఉన్నాడు. ప్రక్కనే రెండు ప్రతిష్ట విగ్రహాలు ఉంటాయి. అక్కడినించి వెనక్కి తిరిగి చూస్తే, కనిపించే ప్రకృతి సౌందర్యం వర్ణనాతీతం. ప్రస్తుతం జీయర్ గారి పర్యవేక్షణలో ఈ ఆలయానికి ఇనప కటకటాలు యేర్పరచ బడ్డవి.
మాలోల నరసిం హుడు
======= =====
మాలోల అంటే, మా = లక్ష్మి, లోల=లోలుడు , మాలోలన్ అంటే, లక్ష్మీ లోలుడు అని అర్థం. అహోబిలం జీయర్ గారితో పాటు తిరిగేది ఈ మాలొలన్ ఉత్సవ మూర్తియే. ఎంతో
అందంగా ఉంటారు స్వామి వారు. జ్వాలా నరసిం హుడి నించి ఒక 2 కి.మి ఉంటుంది . ఇదికూడా అడవి మధ్యలో ఉంటుంది. ప్రస్తుతం జీయర్ గారి పర్యవేక్షనలొ, ఈ ఆలయనికి గొపురం కట్టించ బడింది.
క్రోఢ నరసిం హుడు
======= ===
ఈయన భూవరహా నరసిం హ అవతారం. అమ్మవారు భుజం మీద ఉంటారు(భూమాత రూపంలో).అహోబల నరసిం హుడి దగ్గర్లోనే ఈ క్రోఢ నరసిం హుని ఆలయం ఉంటుంది..
కారంజ నరసిం హుడు
========== ==
ఫాల నేత్రాణల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీనారసిం హా....
ఈ పాట చాలా మంది వినే ఉంటారు. ఐతే, నరసిం హ స్వామికి ఫాలనేత్రము ఎమిటో ఆలొచించారా? ఫాల భాగము అంటే, నుదురు భాగము. అందుకే శివుడిని ఫాలాక్షుడు అంటారు. ఐతె, మరి ఫాల నేత్రాణల అని నరసిం హుడిని ఎందుకు పిలిచినట్టు అన్నమాచార్యుల వారు? ఈ ప్రశ్నకి సమాధానం కావాలి అంటే,కారంజ నరసిం హుడి దర్శనం చేసుకోవాలి. ఈయన ఫాలాక్షుడు. అంతేకాక, చేత ధనుర్భాణాలతో వెలశాడు. ఇక్కడ కి వెళ్ళినప్పుడు, మేము అందరం(అక్కయ్య,అమ్మ, నేను బావగరు) ఫాలనేత్రాణల, కదిరి నృసిం హుడు పాటలు పాడాము. ఈ రెండుపాటలలోనూ, ఫాలనేత్రం గురించి అన్నారు అన్నమాచార్యుల వారు.
భార్గవ నరసిం హుడు
============
ఇక్కడికి వెళ్ళాలంటే, మాములు వాహనాలలొ కుదరదు. ఇది కూడ అడవి మధ్యలో ఉంటుంది. ఆటో, లేదా జీప్ లో వెల్లాలి.
యోగానంద నరసిం హుడు
========= ======
హిరణ్యకశపుని వధ జరిగిన పిమ్మట, స్వామి వారు శాంతించి కొంతకాలం, యొగావస్థలోకి వెళ్ళారట, ఆ మూర్తి ఇక్కడ వెలిసింది. ఇక్కడికి నేరుగా మనం వాహనం లో వెళ్ళవచ్చు. క్రింద అహోబిలం నించి,ఒక 4 కి.మి.
చత్రవట నరసిం హుడు
============
యొగానంద నరసిం హుడి దగ్గరికి వెళ్ళే దారిలోనే, కుడివైఫు కి తిరిగితే, అక్కడ నల్లగా నిగ నిగ లాడుతూ, చత్ర వట నరసిం హుడు దర్శనమిస్తాడు. ఈయన, సంగీత భంగిమలో, తాళం వేస్తూ ఉన్న చేతితో ఉంటారు.
పావన నరసిం హుడు
======== ====
ఈయన శాంత మూర్తి. చెంచు లక్ష్మిని వివహమాడి , చెంచుల గూడెం లోనే వెలిసినాడు. ఈ చెంచులక్ష్మి మీద, అహోబిల మఠం 5వ జీయర్ గారు ఒక పుస్తకం వ్రాశారు.ఇక్కడ కొన్ని సార్లు, మాంసాహర నివేదన జరుగుతుంది. సిమ్హం కద...
నాకు తెలిసినంతగా నేను పైన నవనారసిం హుల గూర్చి చెప్పాను. అహోబిల దర్శనం కలగటమే అదృష్తం. అన్నమాచార్యుల వారి మాటల్లోనే అనుకుంటే,
అగు శ్రీవేంకట మహోబలం
అగమ్య మసురులుకహోబలం
అగపడు పుణ్యులకహోబలం
అగికులరజన్ అహోబలం.....
అహోబిలం నరసిం హుల వారిమీద అన్నమాచార్యుల వారు కొన్ని వందల(వేల) కీర్తనలు వ్రాశారు. ఆయన దయ వల్ల, నాకు కూడా అహోబిల దర్శన భాగ్యం
కలిగింది. ఇంకా వ్రాయాలని ఉన్నా, ఇంతటితో ముగిస్తున్నాను.
నాకు ఈ రకంగా ఇక్కడ వ్రాయటానికి శక్తినిచ్చిన ఆచార్యుల పాదాలకి శత సహస్ర వందనాలు సమర్పించుకుంటూ......
విధేయుడు
వంశీ కృష్ణ కార్తీక్
6 comments:
చాల బాగా వివరించారు. `ప్రతి సంవత్సరం కనీసం రెండుసార్లు స్వామిని దర్శించుకొంటు వుంటాను. తెలియని విషయాలు చెప్పారు. ధన్యవాదములు.
Chala bagundi andi mee explanation.. ee dasudu kooda ahobila mutt sishyudu.. please give your email id..
Dasan
chala baga vivirinchaarandi ahobilam gurinchi.. thappakunda okka sari ayina ee kshethra darsanam chesukovaalani undi..
krutagnathalu..
sumalalitha
Andariki dhanyavaadalu....
baalaji garu, naa email id
vamsi.vallurik@gmail.com
karthik.valluri@oracle.com
Nice Blog. keep posting.
Raghasudha
after many days i saw a telugu blog
plz elane maintain cheyandi
Online Bus Ticket Booking
Post a Comment